ఆయోధ్యలో రామాలయం కోసం జనవరి 15న విరాళాల సేకరణ ప్రారంభం కాగా.. ఇది ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. అయితే, నిర్దేశిత గడువుకు ముందే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ లక్ష్యాన్ని చేరుకుంది. రామాలయం నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.1,511 కోట్ల విరాళాలుగా అందాయి. ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి వెల్లడించారు. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను సందర్శించి, ప్రజల నుంచి విరాళాలను సేకరించాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.
స్వామి గోవింద్ దేవ్ గిరి సూరత్‌లో మీడియాతో మాట్లాడుతూ... ‘అయోధ్యలో
రామాలయం నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు రూ.1,511
కోట్ల విరాళాలు వచ్చాయి. జనవరి 15న ప్రారంభమైన నిధి సేకరణ కార్యక్రమం
ఫిబ్రవరి 27తో ముగియనుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల గ్రామాలను, 11 కోట్ల
కుటుంబాలను కలిసి, నిధిని సేకరించాలన్నది లక్ష్యం.. 492 సంవత్సరాల తర్వాత
రామాలయాన్ని నిర్మించే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. శ్రీరాముడి
జన్మభూమి అయిన అయోధ్యలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించేందుకు యావత్తు
దేశం విరాళాలు అందజేస్తోందని చెప్పారు. ధర్మం కోసం ఏదైనా చేసే అవకాశం
ప్రజలకు దక్కిందన్నారు. ఇక, 2019 నవంబరులో సుప్రీంకోర్టు తీర్పుతో ఆయోధ్యలో
రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ఫిబ్రవరి 2020లో ఆలయ
ట్రస్ట్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. గతేడాది ఆగస్టు 5న ప్రధాని
నరేంద్ర మోదీ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇక, విరాళాల
సేకరణ ప్రారంభమైన తర్వాత కేవలం 25 రోజుల్లోనే రూ.1,000 కోట్ల మార్క్
చేరుకుంది. మొత్తం 1.50 లక్షల మంది వీహెచ్‌పీ కార్యకర్తలు ఈ విరాళాల
సేకరణలో భాగస్వామ్యలయ్యారు. సేకరించిన విరాళాలను డిపాజిట్ చేసే బాధ్యతలను
35 మంది వాలంటీర్లకు అప్పగించారు. మారుమూల పల్లెలకు సైతం వీహెచ్‌పీ
కార్యకర్తలు వెళ్లి విరాళాలు సేకరిస్తున్నారు.