YSRCP తిరుపతి మేయర్ అభ్యర్థి ఖరారు..

 

 తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఆధ్యాత్మిక నగరానికి తొలి మేయర్ ఎవరు అవుతారనేది ఉత్కంఠగా రేపుతోంది. తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక జరగడానికి ముందు జరుగుతున్న ఉప ఎన్నికలకు ప్రాధాన్యం మరింత పెరిగింది. తిరుపతి కార్పొరేషన్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార వైఎస్సార్సీపీ.. మేయర్ అభ్యర్థిని ఖరారు చేసింది. డాక్టర్ శిరీషను మేయర్ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించింది. 27వ డివిజన్‌ నుంచి 2020 మార్చిలో ఆమె కార్పొరేటర్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు.

ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరుపతి మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. మేయర్ అభ్యర్థిత్వం కోసం అధికార పార్టీలో చాలా మంది ఆశావహులు ఉన్నారు. దీంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో చర్చించిన పార్టీ పెద్దలు శిరీష పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. త్వరలోనే చిత్తూరు మేయర్ అభ్యర్థి విషయంలోనూ వైసీపీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

తిరుపతి మున్సిపాలిటీ 1886లో ఏర్పాటైంది. 2007లో మున్సిపల్ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందింది. 2002లో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో తిరుపతిలో ఎన్నికలు జరిగాయి. 2007, 2012ల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు జరగలేదు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. 14 డివిజన్లు జనరల్ మహిళలు, 13 డివి జనరల్, 8 బీసీ మహిళలు, 9 బీసీలు, 3 ఎస్సీలు, 2 ఎస్సీ మహిళలు, ఒక డివిజన్ ఎస్టీలకు కేటాయించారు. తిరుపతిలో సుమారు 5 లక్షల జనాభా ఉంది. 2.66 లక్షల ఓటర్లు ఉన్నారు. తిరుపతి తొలి మేయర్ పీఠం కోసం వైసీపీతోపాటు టీడీపీ, బీజేపీ-జనసేన పోటీ పడుతున్నాయి. కానీ 21 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.