ప్రారంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు..



శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు.



శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 6.03 నుంచి 6.30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు బ్రహ్మాదిదేవతలను ఉత్సవాలకు ఆహ్వానిస్తూ గరుడ పటాన్ని అంతరాలయంలో ఊరేగించి ఎగురవేశారు. తొలిరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పెద్దశేష వాహనంపై దర్శనమిచ్చారు. రాత్రి 8.30 నుంచి 9.30 గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహించారు. ముందుగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. అంతకుముందు సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని శ్రీవారి విమానప్రాకారం చుట్టూ ఊరేగించారు. తర్వాత గరుడ ధ్వజాన్ని తీసుకువచ్చి ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేశారు. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సకల దేవతామూర్తులను, అష్టదిక్పాలకులను ఆహ్వానించారు.


అనంతరం ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణమండపంలో పెద్దశేష వాహనసేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు పెద్దశేషుని అధిరోహించగా అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు తొలి వాహనమైన ఏడుపడగల ఆదిశేషునిపై ఉభయదేవేరులతో భక్తులకు అభయప్రదానం చేశారు. కొవిడ్‌ నిబంధనలతో వాహనసేవను ఏకాంతంగా నిర్వహించారు. అనంత‌శ్చ అస్మి నాగానాం… స‌ర్పానాం అస్మి వాసుకిః’ తాను నాగుల‌లో శేషుడిని, స‌ర్పాల‌లో వాసుకిని అని సాక్షాత్తు ప‌ర‌మాత్మ చెప్పిన‌ట్టు పురాణాల వెల్లడిస్తున్నాయి. త‌న శిర‌స్సుపై స‌మ‌స్త భూభారాన్ని మోసే ఆదిశేషుడు శ్రీహరికి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనం. స్వామివారికి పానుపుగా, దిండుగా, పాదుక‌లుగా, ఛ‌త్రంగా, వాహ‌నంగా శేషుడు సేవ చేస్తుంటాడు. శేషుడిపై ఉన్న స్వామివారిని ద‌ర్శిస్తే పశుత్వం తొలగి మానవత్వం, దాని నుండి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి.